కాకతీయ, ములుగు: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్ దివాకర ముఖ్య అతిథిగా, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) సంపత్ రావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలు అని, వారి చేతుల్లోనే విద్యార్థుల, సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని, మంచి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని అన్నారు.
అనంతరం జిల్లాలో 33మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిఇబి కార్యదర్శి ఈ.సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్లు అర్షం రాజు, కాటం మల్లారెడ్డి, గుళ్లపెల్లి సాంబయ్య, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


