- అభ్యర్థిగా నందమూరి సుహాసిని !
- ఉప ఎన్నికల్లో పోటీకి సైకిల్ పార్టీ సై !
- అధినేత చంద్రబాబుపై తెలంగాణ నేతల ఒత్తిడి !
- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీకి దూరం
- ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున ఇప్పుడూ పోటీ చేయదని ప్రచారం..
కాకతీయ,జూబ్లీహిల్స్: ఉప ఎన్నికతో ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. షెడ్యూల్ విడుదల తర్వాత ఈ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ ఇప్పటికే మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ పేరు జూబ్లీహిల్స్ లో తెరపైకి వచ్చింది.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ లీడర్స్, క్యాడర్ లో జోష్ నింపేందుకైనా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని.. తద్వారా ఉనికిని చాటుకోవాలనిఅధినేతపై తెలంగాణ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ లీడర్లు, క్యాడర్ కూడా ఇదే కోరుకుంటున్నారని వారు అంటున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు సమాచారం.
ఎన్డీఏలో భాగస్వామిగా ..
ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇక్కడ పోటీ చేయదని.. బీజేపీకి మద్దతు ఇస్తుందని అందరూ అంచనా వేశారు. కాగా.. మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో జుబ్లిహిల్స్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు.. ఏపీ నుంచి వచ్చి స్థిర పడిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉండటంతో… టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగితే కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో.. చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. అటు బీజేపీ నేతలు తామే పోటీ చేస్తామని చెబుతున్నారు. బీజేపీ పోటీ చేస్తే వారికే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేసే అవకాశం ఉంది. తెలంగాణలో 2023 ఎన్నికల్లోనూ టీడీపీ దూరంగా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం లేదని చెబుతున్నారు.


