కాకతీయ, తెలంగాణ బ్యూరో: వైసీపీ అధినేత, మాజీ సీఎంకు బిగ్ షాక్ తగిలింది. జగన్ ఇలాకాలో టీడీపీ భారీ విజయం సాధించింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. 6,035 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే దక్కాయి. 30 ఏండ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది.
మరికాసేపట్లో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది. కాగా, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ముఖ్య నేతల ముందస్తు అరెస్టులు, పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆందోళనలతో దద్దరిల్లింది. అయితే, ఇవాళ కౌంటింగ్కు వైసీపీ ఏజెంట్లు ఎవరూ హాజరుకాలేదు.
అదేవిధంగా వారు కౌంటింగ్ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 84.5 శాతం పోలింగ్ నమోదైంది. పది టేబుళ్లను ఏర్పాటు చేసిన అధికారులు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. పులివెందులలో మొత్తం 7,638 ఓట్లు చెల్లుబాటు కాగా.. చెల్లని ఓట్లు 145, నోటాకు 11 ఓట్లు పోల్ అయినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.


