- హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
కాకతీయ, వరంగల్ సిటీ : టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ‘మనుస్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ’ సహకారంతో పోషణ కిట్లను హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎ.అప్పయ్య టీబీ పేషెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడే వారు సమయానుకూలంగా మందులను వేసుకోవాలని అలాగే చక్కటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోవాలన్నారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారన్నారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక టీబి పేషెంట్ల ను ఆరు నెలల కాలం దత్తత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో వారికి మానసిక ధైర్యాన్ని, పోషనార్థం సహకారం ఇచ్చినట్లయితే వారు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు, మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, మనుస్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ మహేష్, జిల్లా టీబీ కోఆర్డినేటర్ నగేష్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.


