న్యూ అవతార్‌లో టాటా సియర్రా..
ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
ఆటోమొబైల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
మళ్లీ పుట్టిన 1991 లెజెండ్
క్లాసిక్ లుక్–మోడర్న్ టెక్నాలజీ కలయికలో ఐకానిక్ సియర్రా ఈజ్ బ్యాక్
కాకతీయ, ఆటోమొబైల్స్ : ఆటోమొబైల్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టాటా సియర్రా చివరకు అధికారికంగా ఆవిష్కరించబడింది.
ఐకానిక్ బ్రాండ్‌కు మరోసారి కొత్త ఊపును తీసుకొచ్చేలా ఈ కారు ఈ నెల 25న మార్కెట్లోకి రానుంది. 90వ దశకంలో సంచలనం సృష్టించిన సియర్రా ఇప్పుడు మరింత ఆధునిక రూపంలో రోడ్డెక్కడానికి సిద్ధమైంది.
1991లో భారత మార్కెట్లోకి వచ్చిన సియర్రా, దేశంలో తయారైన మొట్టమొదటి ఆఫ్రోడర్ ఎస్‌యూవీలలో ఒకటి. ఇప్పుడు అదే వారసత్వానికి కొత్త రూపం ఇస్తూ టాటా మోటార్స్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో తిరిగి తీసుకొస్తోంది. కొత్త మోడల్ డిజైన్ పాత సియర్రాకు శతశాతం గౌరవం ఇచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అల్పైన్ విండో ఆకృతిని గుర్తు చేసే బ్లాక్డ్-అవుట్ సి-పిల్లర్, ఈ కారుకు నాస్టాల్జిక్ టచ్‌ను జతచేస్తోంది. ఫ్లాట్ ఫ్రంట్, ఇన్ఫినిటీ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్పోర్టీ అల్లాయ్స్ వంటి ఆధునిక డిజైన్ ఎలిమెంట్స్ దీన్ని పూర్తిగా ఫ్యూచరిస్టిక్ లుక్‌తో నిలబెడుతున్నాయి.
డిజైన్, ఫీచర్లు, ధర వివరాలు..
ఇంటీరియర్ విషయానికి వస్తే, సియర్రా పూర్తిగా నెక్ట్స్ లెవల్ అనుభూతిని ఇస్తుంది. డాష్‌బోర్డ్‌పై మూడు భారీ 12.3-అంగుళాల స్క్రీన్లు ఉండటం దీని ముఖ్య USP. డ్రైవర్ క్లస్టర్ నుంచి సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్రత్యేకంగా ప్యాసింజర్ సైడ్ స్క్రీన్ వరకు—క్యాబిన్ మొత్తం ఫ్యూచరిస్టిక్, ప్రీమియం అనుభూతిని కలిగించేలా రూపొందించారు. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & కార్‌ప్లే వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి.
పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, టాటా సియర్రా మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్, అలాగే అత్యంత ఆసక్తికరమైన సియర్రా ఈవీ. ఈవీ మోడల్ ACT EV ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది మరియు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 నుండి 550 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని అంచనా. భద్రతలో కూడా సియర్రా రాజీపడలేదు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS టెక్నాలజీ, 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లతో కొత్త సియర్రా ఫైవ్‌స్టార్ రేటింగ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక ఫైనల్ గా ధరల విషయానికి వస్తే, పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 17 లక్షల నుండి రూ. 22 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఎలక్ట్రిక్ వెర్షన్ రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.


