కాకతీయ, నేషనల్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏండ్ల యువతి పై రెండు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఎంథాల్ బైపాస్ వద్ద చోటుచేసుకుంది, అక్కడ టమాటా లోడ్ ఉన్న వాహనం నుంచి పోలీసులు తనిఖీ కోసం ఆపారు.
ఎంథాల్ బైపాస్ దగ్గర నిన్న రాత్రి టమాటా లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ వాహనాన్ని ఇద్దరు కానిస్టేబుల్స్ ఆపి చెక్ చేశారు. తనిఖీల సందర్భంగా ఆ వాహనంలో ఉన్న యువతిపై పోలీసులు కన్నేశారు. అనుమానం ఉందంటూ దబాయించారు. ఆ యువతిని కొట్టి కిందికి దించారు. తన సోదరి ముందే ఆమెను పక్కనే ఉన్న పంట పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. సుందర్, సురేశ్ రాజ్..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గట్టికేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికులు అక్కడికి చేరుకునే లోపు పోలీసులు పరార్ అయ్యారు. స్థానికులు బాధిత యువతిని అంబులెన్స్ లో తిరువన్నమలై ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు..బాధితురాలిని ఆసుపత్రిలో విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అయితే తన సోదరితో కలిసి అరుణాచలం దైవదర్శనానికి వచ్చినట్లు ఆ యువతి పేర్కొంది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్ల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


