ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వినియోగించుకోండి
5% తగ్గింపుతో పన్నులు చెల్లించాలని పిలుపు
పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్ : ఎర్లీ బర్డ్ స్కీం కింద 5% రాయితీతో ఆస్తి పన్నులు చెల్లించే అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ సూచించారు. పన్నులు సకాలంలో చెల్లించి వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రాన్ని మేయర్ సందర్శించారు. రెవెన్యూ అధికారులతో కలిసి కౌంటర్ల వద్ద పరిస్థితులను పరిశీలించారు. 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు. ఎర్లీ బర్డ్ స్కీంలో ప్రజలు అధికంగా స్పందిస్తున్నందున కౌంటర్ల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. త్రాగునీరు, కూలర్లు, కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పన్నుల చెల్లింపులో ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాధర్ మొహియుద్దీన్, ఆర్వో శివప్రసాద్, కార్పొరేటర్లు కాజ రమ శివరాం, బండ రమణారెడ్డి, భారీ అపర్ణ జితేందర్, చంద్ర, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు.


