- పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల : సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రేవూరితో పాటు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తి కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. తేమ శాతం 20 వరకు ఉన్న పత్తినీ కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రతీ ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పరిమితిని ఎత్తివేసి, 12 క్వింటాళ్లు వరకు కొనుగోలు చేసేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకీ పరిహారం అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అధికారులు వెంటనే సర్వే నిర్వహించి నష్టాల వివరాలను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యేలు కనీస మద్దతు ధర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


