తైబజార్, పశువుల సంత వేలం… రూ.89 లక్షల ఆదాయం
– తైబజార్ రూ.70 లక్షలకు, పశువుల సంత రూ.19 లక్షలకు కేటాయింపు
– చైర్‌పర్సన్ చందన రవీందర్ అధ్యక్షతన కార్యక్రమం
కాకతీయ, గజ్వేల్ : 2026- 27 ఆర్థిక సంవత్సరానికి గజ్వేల్ మున్సిపాలిటీలో నిర్వహించిన తైబజార్, పశువుల సంత వేలంపాట ద్వారా మొత్తం రూ.89 లక్షల ఆదాయం లభించింది. శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమిషనర్ ఆర్. వెంకట గోపాల్ ఆధ్వర్యంలో కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. తైబజార్ వేలంలో 21 మంది పాల్గొనగా, అత్యధికంగా ఈ. భిక్షపతి రూ.70 లక్షలకు దక్కించుకున్నారు. పశువుల సంత వేలంలో 32 మంది పాల్గొనగా, టి. రాజేశం రూ.19 లక్షలకు అత్యధికంగా వేలం పాడి సంతను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


