ప్రభుత్వ భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం
ప్రజలకు సులభంగా అందుబాటులో సేవలు

కాకతీయ, ఖిలా వరంగల్ : ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కొత్త ప్రదేశానికి తరలించారు. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ కార్యాలయాన్ని శుక్రవారం శివనగర్ మీసేవ కేంద్రం వద్ద ఉన్న ప్రభుత్వ భవనంలోకి మార్చారు. ప్రారంభంలో కార్యాలయాన్ని లక్ష్మీపురం కమ్యూనిటీ హాల్‌కు తరలించే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ ప్రాంతం మండల ప్రజలకు దూరంగా ఉండటంతో సాధారణ ప్రజలు, రైతులు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని ‘కాకతీయ’ దినపత్రిక విశేషంగా ప్రస్తావించింది. ఈ అంశంపై స్పందించిన తహసీల్దార్, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యాలయాన్ని మండల పరిధిలోనే కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. శివనగర్‌లోని కొత్త కార్యాలయం మండల ప్రజలకు సులభంగా చేరుకునేలా ఉండటంతో సేవలు మరింత సమర్థంగా అందించగలమన్నారు. ఈ మార్పుతో రైతులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు ప్రభుత్వ సేవల అందుబాటు మెరుగుపడుతుందని తెలిపారు.


