టా.ప్రా. రాష్ట్ర మహాసభలు
పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా.ప్రా.) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో ఆరవ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, గౌరవ అధ్యక్షుడు కట్టా నాగభూషణాచారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో టా.ప్రా. సంఘం రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో తాత్సారం చేయడం వల్ల పలువురు పెన్షనర్లు సకాలంలో తమ హక్కులు పొందలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతూ, మరణాలకు కూడా కారణమవుతున్న పరిస్థితి దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వ పనితీరే కారణమని తీవ్రంగా విమర్శించారు.2024 మార్చి నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ విధమైన ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లు మనోవేదనకు గురి కాకుండా ఆత్మస్థైర్యంతో జీవించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
అలాగే జూలై 2023 నుంచి నూతన పీఆర్‌సీని అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ మహాసభల్లో కరీంనగర్ జిల్లా నుంచి టా.ప్రా. సంఘ నాయకులు పెద్దపేట రమేష్, భారత ప్రభాకర్, చీకట్ల సమ్మయ్య, మండల వీరస్వామి, గరిగె చంద్రయ్య, కే. రామచంద్రం, బి. ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


