పాత కక్షలతో కత్తి దాడి
తీవ్రంగా గాయపడిన యువకుడు..ఆసుపత్రికి తరలింపు
కాకతీయ, కూసుమంచి: మండలంలోని లోక్య తండాలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన వడిత్య హేమ్లపై మస్తాన్, తేజవత్ నాగేంద్రబాబులు కాపుకాచి ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాడిలో హేమ్ల తీవ్రంగా గాయపడగా వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


