కాకతీయ, వరంగల్ బ్యూరో: పసితనంలోనే తల్లిని కోల్పోయిన కొద్దికాలానికే తండ్రి జాడ లేకుండా పోయాడు. మూడేళ్ల వయసులో అనాథాశ్రమంలో చేరిన చిన్నారిని..స్వీడన్‌కు చెందిన ఓ దంపతుల దత్తతలో పెరిగింది. కాలం గడిచిపోయింది. కానీ మనసులో ఒకే తపన.. నా స్వంత తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆమె స్వీడన్ నుంచి వరంగల్ వరకు తన అన్వేషణ కొనసాగిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాకు చెందిన బి. రాజ్‌కుమార్ అనే వ్యక్తి కుమార్తె సంధ్యారాణి. పసివయస్సులోనే తల్లి మరణించడంతో.. మూడేళ్ల వయసులోనే అనాథాశ్రమంలో చేరింది. కొద్ది రోజులకు స్వీడన్ దంపతులు లిండ్గ్రెన్ ఆమెను దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకెళ్లారు. అక్కడే చదువుకుని పెరిగిన సంధ్య, పెద్దయ్యాక తన మూలాలు తెలుసుకోవాలని నిశ్చయించుకుంది.
2009లో ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లిన సంధ్య, తన స్నేహితుల సలహాతో హైదరాబాద్‌కి వచ్చింది. అక్కడ తనను దత్తత ఇచ్చిన అనాథాశ్రమం వివరాలు సేకరించింది. అయితే తండ్రి రాజ్‌కుమార్ ఎక్కడున్నాడన్న స్పష్టత మాత్రం రాలేదు. పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ నిజాం కాలేజీలో తోటమాలిగా పనిచేశాడు. అక్కడే సహోద్యోగితో సన్నిహితమయ్యాడు. రెండో వివాహం చేసుకున్న మూడు నెలలకే, తన కుమార్తె సంధ్యను విజయనగర్ కాలనీలోని సేవా సమాజ అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
స్వీడన్‌లో పెరిగినా తన మూలాలను వెతికే పట్టుదలతో సంధ్య పుణెలోని Adoptee Rights Council సాయం తీసుకుంది. వారి సహాయంతో తిరిగి హైదరాబాద్ చేరి, చివరకు తన తండ్రి వరంగల్‌కు చెందినవాడని తెలుసుకుంది. ప్రస్తుతం ఆమె వరంగల్‌లో ఉంటూ తండ్రి కోసం తన అన్వేషణ కొనసాగిస్తోంది.


