సామాజిక సమానత్వంతోనే సుస్థిర అభివృద్ధి
కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : సామాజిక సమానత్వం సాధించినప్పుడే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని, దేశం సమగ్ర పురోగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భగత్‌నగర్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయ దినోత్సవం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులు, నిరుపేదలు, వృద్ధులకు న్యాయం అందేలా అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అందరూ ఐక్యంగా పరస్పరం సహకరించుకుంటే సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలని, ముఖ్యంగా బాలికలు విద్య ద్వారానే ఆర్థిక స్వావలంబన సాధించగలరని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి ద్వారానే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని, విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ వసతి గృహాన్ని పరిశీలించి, గీజర్‌లు సహా ఇతర సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో రాణించాలి : క్రీడా పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ సూచన
ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు నిరంతర సాధనతో జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆమె, విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను పరిశీలించారు. జిమ్, క్రీడా పరికరాలు, వసతి సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్, యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి విభాగాల్లో అందుబాటులో ఉన్న వసతులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆహార మెనూ, రోజువారీ ప్రాక్టీస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను చూసి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి (డివైఎస్ఓ) శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు


