జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి..
కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బాలసముద్రం సమీపంలో ఉన్న జాగృతి హాస్పిటల్‌లో డెలివరీ కోసం వచ్చిన గర్భిణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.వివరాల్లోకి వెళ్తే, డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆమెను మరో ఆసుపత్రికి తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున జాగృతి హాస్పిటల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ముందు ధర్నాకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జాగృతి హాస్పిటల్ యాజమాన్యం ఆసుపత్రికి తాళం వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.



