పాత నేరస్థులపై నిఘా అవసరం
అంతర్‌రాష్ట్ర దొంగల కదలికలపై ప్రత్యేక దృష్టి
సీసీఎస్ పోలీసులకు సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలు
సిటీ క్రైమ్ స్టేషన్ వార్షిక తనిఖీ
కాకతీయ, హనుమకొండ : గతంలో చోరీలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సిటీ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చోరీల నియంత్రణలో నిర్లక్ష్యం తగదని, పాత నేరస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం వరంగల్ సిటీ క్రైమ్ స్టేషన్‌ను సీపీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీఎస్‌కు చేరుకున్న కమిషనర్‌కు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం నిర్వహించారు. తనిఖీల సమయంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించిన సీపీ, అనంతరం పాత నేరస్థుల ఫోటోలు, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, చోరీలకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీల నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన నిందితుల వివరాలను సమగ్రంగా సేకరించాలని సూచించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో చోరీ కేసుల్లో పట్టుబడిన నిందితుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉంచుకోవాలని ఆదేశించారు. నేరాల నివారణకు గట్టి నిఘా, ముందస్తు చర్యలే ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, సిటీ క్రైమ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ, ఎస్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


