కోత కుట్టు లేకుండా కు.ని. ఆపరేషన్
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాలతో మంగళవారం సికెఎం ఆసుపత్రి అనుబంధ ఉర్సు ఆసుపత్రిలో పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారావు ఆధ్వర్యంలో 15 మంది పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు క్యాంపు ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ పురుషులకు చేసే వేసేక్టమీ ఆపరేషన్ సాధారణమైనదనీ, ఎలాంటి కోత కుట్లు లేని రెండు నిమిషాలలో నిర్వహించే ఆపరేషననీ, ఇది చేసుకోవడం వలన పురుషులలో ఎలాంటి వైకల్యము రాదని వాళ్లు సాధారణమైన జీవితము గడపవచ్చునని పురుషునిగా కుటుంబ బాధ్యత నిర్వహించవచ్చునని తెలియజేశారు. గతంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకొని సాధారణమైన జీవితం గడుపుతున్నారని, ఎలాంటి సమస్యలు రాలేదని, పురుషులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేసేక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాత శిశు సంరక్షణ కార్యక్రమం అధికారి డాక్టర్ విజయకుమార్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రతీక్, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు


