కాకతీయ, నేషనల్ డెస్క్: వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం అందించకూడదని..దీనికోసం నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. రేబిస్ లేదా విపరీత అక్రోశం కలిగిన కుక్కలు మినహా ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిని స్టెరిలైజేషన్ చేసిన అనంతరం విడుదల చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సవరించింది.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ ఆగస్టు 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వీటి దారులు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీలో అవి ఎక్కడా కనిపించడానికి వీల్లెదని తీర్పు ఇచ్చింది. వీటిని షెల్టర్లకు తరలించాలన్న ఆదేశాలపై జంతు హక్కుల సంఘాలతో పాటు పలువురు ప్రముఖుల నుంచి నిరసన వ్యక్తమైన నేపథ్యంలో మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మునుపటి తీర్పును సవరిస్తూ ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది.


