కాకతీయ, నేషనల్ డెస్క్: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ముస్లింలకు అనుకూలంగా వచ్చినట్లు భావించిన వక్ఫ్ సవరణ చట్టంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి, పాత చట్టంలోని అనేక నిబంధనలను రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ముస్లింల సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు పిటిషనర్లు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజాగా ఈ వివాదాస్పద చట్టంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఐదు సంవత్సరాలు ఇస్లామ్ మతాన్ని అనుసరించినవారే వక్ఫ్ బోర్డులో భాగమయ్యే అర్హత కలిగి ఉంటారనే నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే వక్ఫ్ సవరణ చట్టంలోని మిగతా నిబంధనలన్నింటినీ నిలిపివేయాలని కోరిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అంటే చట్టంలోని ఒక కీలక నిబంధనకు మాత్రమే స్టే మంజూరు చేసి, మిగతావి కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో వక్ఫ్ బోర్డులో పదవులు చేపట్టే అర్హతపై తాత్కాలిక ఉపశమనం లభించినట్టే. అయితే, కొత్త చట్టంలోని మిగతా మార్పులు మాత్రం అమల్లోకి వస్తాయి. బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని అవసరమైన సంస్కరణగా సమర్థించగా, ముస్లింలకు చెందిన పలు సంస్థలు, నాయకులు దీనిని మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా విమర్శిస్తున్నారు.
వక్ఫ్ చట్టం అంటే ఏమిటి?
వక్ఫ్ అనేది ముస్లింల మతపరమైన ఆస్తుల నిర్వహణ కోసం రూపొందించిన చట్టం. ఈ ఆస్తులు మసీదులు, దర్గా, సమాధులు, విద్యాసంస్థలు మొదలైన వాటిని కలిగి ఉంటాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసి, వక్ఫ్ ఆస్తుల రక్షణకు మరిన్ని నిబంధనలు జోడించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా వాటిలో కొన్నింటిని రద్దు చేస్తూ, ఆస్తుల నియంత్రణలో మార్పులు చేసింది.
సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు వక్ఫ్ చట్టం అమలులో కొంత స్పష్టత తీసుకువచ్చాయి. ముస్లిం సమాజానికి సంబంధించిన పలు సంఘాలు దీన్ని స్వాగతిస్తున్నప్పటికీ, పూర్తి న్యాయం సాధించాలంటే కేసు తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ తీర్పు రాబోయే రోజుల్లో మతపరమైన చట్టాలు, ఆస్తుల నిర్వహణ, రాజకీయ ప్రభావాలపై కీలకంగా మారే అవకాశం ఉంది.


