నాణ్యమైన పత్తికే మద్దతు ధర
వరంగల్ కలెక్టర్ సత్య శారద
కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలంలోని దేసైపెళ్లి, ముద్దునూరు గ్రామాల్లో కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఐ ద్వారా పత్తి అమ్మకానికి కాపస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. బంధంపెళ్లి, దేసైపెళ్లి గ్రామాల రైతులతో మాట్లాడిన కలెక్టర్ , రైతులు తమ మొబైల్ నంబర్లు యాప్‌లో అప్డేట్ చేసుకోవాలని, స్లాట్ బుక్ చేసుకున్న తేదీకి అనుగుణంగా పత్తి మార్కెట్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నాణ్యమైన పత్తికి క్వింటాల్‌కు రూ. 8110 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. పత్తి ఏరేటప్పుడు కాటన్ బ్యాగులు లేదా పాత చీరలు ఉపయోగించాలని, ప్లాస్టిక్ సంచులు వాడరాదని రైతులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, నర్సంపేట ఏ డి ఏ దామోదర్ రెడ్డి, వ్యవసాయ అధికారి మాధవి, ఏ ఈ ఓ లు హనుమంతు, విజయ్, రాజేశ్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.


