అమావాస్య పేరుతో మూఢనమ్మకాలు
చింతల్ ఫ్లైఓవర్ వద్ద పసుపు, కుంకుమ, నల్ల కోళ్లు, నిమ్మకాయలు
ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజల్లో ఆందోళన
కాకతీయ, ఖిలావరంగల్ : చింతల్ ఫ్లైఓవర్ వద్ద ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని మూఢనమ్మకాల పేరిట రోడ్డుమధ్య కొబ్బరికాయలు, కోడిగుడ్లు, గుమ్మడికాయలు, పసుపు, కుంకుమ, నల్ల కోళ్లు, నిమ్మకాయలు ఉంచారు. దీంతో బాటసార్లు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మహిళలు, చిన్నారులు ఈ దృశ్యాన్ని చూసి కొంతసేపు అక్కడే నిలిచిపోయారు. సోషల్ మీడియాలో “ఈ అమావాస్య చాలా బలమైనది” అంటూ ప్రచారం జరగడంతో భయం మరింత పెరిగింది. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రజల మనసుల్లో అనవసర ఆందోళన నెలకొంది.
అయితే చైతన్యవంతులు స్పందిస్తూ— ఇవన్నీ పూర్తిగా మూఢనమ్మకాలేనని, అమావాస్య, పౌర్ణమి వంటి రోజులు ప్రకృతి ప్రక్రియలేనని స్పష్టం చేశారు. రోడ్లపై ఇలాంటి వస్తువులు ఉంచడం ప్రమాదాలకు దారితీయొచ్చని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, భయానికి బదులు విజ్ఞానం, మూఢనమ్మకాలకన్నా మానవత్వం వైపు సమాజం ముందుకు సాగాలని పలువురు కోరుతున్నారు


