*కొండా సురేఖ ఇంటిలోనే సుమంత్*
*బయట పడిన వీడియో..!సీఎం రేవంత్ సీరియస్*
*కొండా ఇంటి వద్ద భద్రత తొలగింపు.. మంత్రి పదవిపై నీలి మేఘాలు*
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటిలోనే మాజీ ఓఎస్డీ సుమంత్ తలదాచుకున్నట్లుగా పోలీసులు అనుమానం నిజమే అయ్యింది. బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి చేరుకుని సెర్చ్ చేసే ప్రయత్నం చేయగా.. సుమంత్ ఇక్కడ లేడని మంత్రి కూతురు సుస్మిత పటేల్ వారితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం రాత్రి సుమంత్‌ను స్వయంగా మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత పటేల్ ఇంటి నుంచి కారులో తీసుకుని వెళ్తున్న వీడియోలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఈ విషయం తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
మంత్రి ఇంటి వద్ద భద్రత తొలగింపు
హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి సురేఖ ఇంటి వద్ద ప్రభుత్వ భద్రత సిబ్బందిని తొలగించడం గమనార్హం. మంత్రులకు ఇవ్వాల్సిన పోలీస్ ప్రొటెక్షన్‌ను ప్రభుత్వం ఆకస్మాత్తుగా రద్దు చేసింది. ఓఎస్డీ సుమంత్‌ను విధుల నుంచి టెర్మినేట్ చేయడంతో పాటు ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో పోలీస్ శాఖ ఆ పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. మరో వైపు దేవాదాయ శాఖ పరిధిలో జరగాల్సిసన మేడారం వర్కులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
కొండా దంపతులపై అధిష్ఠానం సీరియస్
మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వ్యవహారం పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొండా దంపతులు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడటం, వ్యవహార శైలిని ప్రదర్శిస్తున్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపణుల రావడం.. ఉత్తమ్‌లాంటి పార్టీ పెద్ద లీడర్ల నుంచి చర్యలకు సీఎంకు సిఫార్సులు వెళ్లడంతో రేవంత్ రెడ్డి సైతం సీరియస్‌గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా సుమంత్ వ్యవహారంలో కొండా ఫ్యామిలీ అనుసరిస్తున్న విధానంతో ఇక తాడోపేడో తేల్చేయాలన్న నిర్ణయంతో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లుగా సమాచారం. ఈమేరకు సురేఖ మంత్రి పదవి ఉంటుందా…? ఊడుతుందా ? అన్న చర్చ మరోసారి తెరపైకి వస్తోంది. హన్మకొండలోని ఆమె ఇంటి వద్ద భద్రత తొలగింపు ఇందుకు సంకేతమేనా..? అన్న విశ్లేషణ జరుగుతోంది. ఈ రోజు కేబినేట్ సమావేశంలో ఈ విషయంపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.



