ఆత్మహత్యాయత్నం డ్రామా
పోలీసులను బ్లాక్ మెయిల్
నిందితుడు అరెస్ట్
కాకతీయ, కరీంనగర్: కేసు నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్యాయత్నం చేస్తున్నానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారం వివాదం నేపథ్యంలో జరిగిన దాడి, డబ్బుల దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న రోమాల ఉదయ్ పరారైనప్పటికీ సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్న ఉదయ్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. యువతి మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఉదయ్ అసహనం వ్యక్తం చేశాడు. జనవరి 18న ఆమెను తీగలగుట్టపల్లిలోని చంద్రపురి కాలనీకి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి బెదిరించాడు. యువతి కాబోయే భర్తను అక్కడికి పిలిపించి దాడి చేసి రూ.50 వేల కోసం ఒత్తిడి తెచ్చాడు. వారి వద్ద ఉన్న బైక్, రూ.2వేల నగదు తీసుకుని వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యువతిని పోలీస్ స్టేషన్ సమీపంలో దింపి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదవడంతో ఉదయ్ పురుగుమందు తాగినట్టుగా వీడియో విడుదల చేసి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశాడు. తరువాత పరారయ్యాడు. గాలింపు చర్యల్లో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై వీణవంక, కరీంనగర్ పోలీస్ స్టేషన్లలో పూర్వపు కేసులు ఉన్నాయని వెల్లడించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు ఇటువంటి డ్రామాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


