వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!
రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్
డీఎస్పీగా శ్రీనివాసులు నియామకం
బదిలీ వెనుక కారణాలపై ఊహాగానాలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడ సబ్‌డివిజన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యువ ఐపీఎస్ అధికారి రుత్విక్ సాయి కొట్టేను ఆకస్మికంగా బదిలీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధ్యతలు చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో ఏసీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులను వేములవాడ డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సాధారణ పరిపాలనా మార్పు మాత్రమేనని పోలీసు వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, బదిలీ వెనుక ఇతర కారణాలు ఉన్నాయన్న చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ మార్పు చర్చనీయాంశంగా మారింది.
అక్రమ మద్యం దందాపై కఠిన చర్యలే కారణమా?
ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో పట్టణంలో కొనసాగుతున్న అక్రమ మద్యం వ్యాపారంపై రుత్విక్ సాయి కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో మద్యం స్వాధీనం చేసుకోవడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దాడులు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించడం వల్ల కొంతమంది ప్రభావశీల వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బదిలీకి కారణాలు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రుత్విక్ సాయిని ఉట్నూర్ ఏఎస్పీగా బదిలీ చేసినట్లు సమాచారం.
క్రమశిక్షణాధికారికి బదిలీ వేటా?
అక్రమాలు, అవినీతి అంశాలపై కఠినంగా వ్యవహరించిన అధికారికి తక్షణ బదిలీ అవసరమా అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం సహజమే అయినా, క్రమశిక్షణతో పనిచేస్తున్న అధికారిపై ఇంత త్వరగా బదిలీ ఉత్తర్వులు జారీ కావడం వెనుక అసలు కారణాలేమిటన్నది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ బదిలీ పూర్తిగా పరిపాలనా నిర్ణయమా? లేక ఇతర ఒత్తిళ్ల ఫలితమా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక వర్గాల నుంచి పూర్తి వివరణ వెలువడాల్సి ఉంది.


