విద్యార్థులకు నాణ్యమైన విద్యా, ఆహారాన్ని అందించాలి…
*దుగ్గొండిలో పీఎం శ్రీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారదా
కాకతీయ, దుగ్గొండి: విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సత్య శారాద అన్నారు. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత ఉండేలా సరైన జాగ్రత్తలు తీసుకోవాలనిని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య శారాద ఆకస్మికంగా తనిఖీ చేసి, వసతులు, భోజన నాణ్యత, మరియు పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీసి, నాణ్యమైన విద్యను, పౌష్టికాహారాన్ని అందించాలని, నూతనంగా నిర్మించిన వంటశాలను పూర్తిగా శుభ్రపరిచి తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని, ప్రస్తుత వంటశాల ప్రదేశాన్ని ఖాళీ చేసి శుభ్రపరచి అంగన్వాడీ కేంద్రానికి అప్పగించాలని ఆదేశించారు. అలాగే కిచెన్ షెడ్, కూరగాయలు, బియ్యం, పప్పులు, ఇతర సామగ్రిని పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, వంట విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని సిబ్బందిని హెచ్చరించారు.


సందర్శనలో గుర్తించిన లోపాలను ఒక వారం లోపు సరిచేసి, ఫోటోలతో కూడిన అనుసరణ నివేదికను సమర్పించాలని ప్రధానోపాధ్యాయునికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి….
రానున్న పదవ తరగతిలో పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సంసిద్ధం చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. 100% ఉత్తీర్ణత సాధించాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా విద్యావంతులు కావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని.. కలెక్టర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల గణిత, ఆంగ్ల సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిని లెక్కల అరుంధతి, డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి, మండల విద్యా అధికారి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు ఎలగొండ రామస్వామి, గ్రామ పరిపాలన అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


