బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిల విడుదలకు విద్యార్థుల ధర్నా..
కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బిసి, ఎస్సీ, ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సుమారు మూడు వందల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా జాక్ చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించి విద్యార్థులను పాఠశాలలు, హాస్టళ్లలోకి అనుమతించాలి. లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిలే నిరాహార దీక్షలు చేపడతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మేకల సుమన్, గూగులోత్ రాజన్న నాయక్, ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మైదం రవి, వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్కూరి సునీల్, యేసోబు, మురళి, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


