రాష్ట్ర స్థాయి పోటీలకు ఇనుగుర్తి విద్యార్థుల సత్తా
జిల్లా స్థాయి పోటీల్లో మెరిసిన ఆరుగురు క్రీడాకారులు ఎంపిక
కాకతీయ, ఇనుగుర్తి : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు సీఎం కప్ క్రీడా పోటీలలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. జిల్లా స్థాయి పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి మొత్తం ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. వాలీబాల్ విభాగంలో చిదిరాల వివేక్ అద్భుత ప్రదర్శనతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. సాఫ్ట్‌బాల్ బాలికల విభాగంలో నంగునూరు భార్గవి, బి. నిహారిక, బొల్లు సహస్రలు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. బాలుర విభాగంలో జాటోతు అజయ్, గుగులోతు రాము ఉత్తమ క్రీడా నైపుణ్యంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఇనుగుర్తి మండలం నుంచి ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల స్థానికులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీడీవో బండారు పార్థసారధి, ఎంఈఓ జంగారూపారాణి క్రీడాకారులను అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి మండలానికి కీర్తి తేవాలని ఆకాంక్షించారు. ఈ విజయానికి ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.


