- జమ్మికుంటలోని హాస్టల్‌లో కలకలం
- యాజమాన్యం నిర్లక్ష్యమని విద్యార్థి సంఘాల ఆగ్రహం
కాకతీయ, హుజురాబాద్: జమ్మికుంట పట్టణంలోని ఎస్వీ ప్రైవేట్ పాఠశాలలోని హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు సోమవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థుల కథనం ప్రకారం.. హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులు రామ్‌చరణ్, చరణ్ సోమవారం పాఠశాల బయటకు వెళ్లి ధూమపానం చేసినట్లు ఉపాధ్యాయులకు సమాచారం అందింది. దీంతో ఉపాధ్యాయులు మందలించి, వారి తల్లిదండ్రులను పిలిపించాలని చెప్పారు. భయంతో వారిరువురు రాత్రి 12 గంటల సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్కూల్ యాజమాన్యం ఈ విషయం తెలుసుకొని విద్యార్థులను వెంటనే పట్టణంలోని సంజీవని హాస్పిటల్కు తరలించింది. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి దారితీసినట్లు ఆరోపిస్తూ పాఠశాల ఎదుట నిరసన చేపట్టాయి.


