విద్యార్థులే ఉపాధ్యాయులుగా
నర్సింహులగూడెం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని నర్సింహులగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించిన విద్యార్థిని నందిని మాట్లాడుతూ హెచ్‌ఎం బాధ్యతలు నిర్వహించడం గర్వంగా అనిపించిందన్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధనలో పడే కృషి ఎంత గొప్పదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని తెలిపారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరి పాఠశాల, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఉత్తమ బోధన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జడ్జీలుగా హరినాథ్, సుకన్య, సంగ శ్రీనివాస్, డీఈఓగా నిత్యశ్రీ, ఎంఈఓగా నవదీప్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


