విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించాలి
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని వెల్ఫేర్ హాస్టల్స్, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంప్లైంట్ బాక్స్‌లకు అందిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, హాస్టల్ నిర్వహణలో లోపాలుంటే తక్షణమే సరిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుండి పలు సమస్యలపై ఫిర్యాదుల పెట్టె ద్వారా అందిన ఫిర్యాదులను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించేలా సంబంధిత విభాగాల అధికారులకు కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలన్నారు. గీజర్స్, బ్లాంకెట్స్ లభ్యతపై ప్రత్యేక సమీక్ష చేసి హాస్టల్స్‌లో చలికాలం వేడి నీటి సౌకర్యం (గీజర్స్) లభ్యతపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అవసరమున్న హాస్టల్స్ వివరాలతో కూడిన నివేదికలను తక్షణమే సమర్పించాలని సంక్షేమ విభాగ అధికారులను ఆదేశించారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్ వారీగా హాట్ వాటర్ గీజర్స్, ఉలెన్ బ్లాంకెట్స్ వంటి తగిన వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థుల వసతి, భోజనం, శుభ్రత, భద్రత, రోజువారీ ఆహార సరఫరా, డీలర్ల ద్వారా బియ్యం–పప్పులు వచ్చే విధానం, ఆహార నాణ్యతపై కలెక్టర్ సమగ్రంగా ఆదేశాలు జారీ చేశారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, తెలంగాణ మోడల్ స్కూల్స్, కేజీవీబీ హాస్టల్స్ సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు భాగ్యలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య, మైనారిటీ వెల్ఫేర్ అధికారి రమేష్, , జి సి డి ఓ ఫ్లోరెన్స్, ఆర్ సి ఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


