కార్మికుల హక్కుల కోసం పోరాటం
ప్రభుత్వం మాట ఇచ్చి తప్పింది
బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వ్యాఖ్యలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆజంజాహీ మిల్లు కార్మిక భవనం భూమి కబ్జా అంశం మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. కార్మిక భవనం నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి భర్తే తమ ఎన్నికల గెలుపు కోసం రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పుకున్నారని గుర్తుచేశారు. ఆ డబ్బును తిరిగి సంపాదించుకోవడానికే కార్మిక భవనం భూమి అక్రమ కబ్జాలకు అంగీకారం తెలిపారా? అని ప్రశ్నించారు. “నీవు నిజంగా కార్మికుల భవనం కోసం పోరాడుతున్నావా? లేక కబ్జా భవనం కోసం పాటుపడుతున్నావా?” అంటూ స్థానిక ఎమ్మెల్యే వైఖరిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పష్టత ఇవ్వకపోతే కార్మిక కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతాయని హెచ్చరించారు. కార్మిక భవనం కోసం ప్రభావిత భూమిని తిరిగి కొనుగోలు చేసి భవనం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలుకాలేదని ప్రదీప్‌రావు మండిపడ్డారు. ఏడాది గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కబ్జాదారులపై చర్యలు కనిపించడం లేదని ఆరోపించారు. అందుకే మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇది కేవలం భవనం సమస్య కాదని, కార్మికుల హక్కుల కోసం సాగే పోరాటమని స్పష్టం చేశారు. కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావంచన పాలనకు ఇదే నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం మేల్కొనే వరకు ఈ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీజేపీ నేతలు, కార్మికులు పాల్గొన్నారు.


