- వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పటిష్ఠ కార్యాచరణతో వరద ముంపు నివారణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. గురువారం వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలైన చిన్న వడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాలు, లక్ష్మి గణపతి కాలనీ, ఎల్బీనగర్ లోని అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ముంపు సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక డ్రెయినేజీ వ్యవస్థలను సమీక్షించి, నీటి ప్రవాహ మార్గాలను సరిచేసే చర్యలు తక్షణం చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా విని, త్వరితగతిన ఉపశమన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి కార్పొరేటర్ సురేష్ జోషి, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఎంహెచ్ వో రాజేష్ ఇరిగేషన్ ఈ ఈ కిరణ్, బల్దియా ఈ ఈ సంతోష్ బాబు, డీఈ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


