పకడ్బందీగా నామినేషన్ ప్రక్రియ
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి
అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం
హుజురాబాద్, జమ్మికుంటలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల పరిశీలన
కాకతీయ, జమ్మికుంట: ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, నామినేషన్ ఫారాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆయా వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాఖలైన నామినేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి వెంటవెంటనే రోజు వారీగా టీ.పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈనెల 30వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని సూచించారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలన జరిపేలా అవసరమైన సిబ్బందిని నియమించామని అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండి. ఆయాజ్, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఉన్నారు.


