కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం జిల్లాలో పకడ్బందీగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్టోబర్ 1న ఎన్నికల షెడ్యూల్ కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసి ఇప్పుడు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని వృద్ధులకు సూచించారు. సామాజిక భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వయోవృద్ధుల నుండి తల్లిదండ్రులు,సంతానం మధ్య సమస్యలపై వచ్చే ఫిర్యాదులను చట్టం ప్రకారం స్పష్టంగా, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.ఈ ఏడాది జిల్లాలో వయోవృద్ధుల సమస్యలకు సంబంధించి 200కి పైగా ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో వయోవృద్ధుల సేవలో ప్రత్యేకంగా పనిచేసిన పలువురిని కలెక్టర్ పమేలా సత్పతి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, మోసం అంజయ్య, అడ్వకేట్ ఎర్రం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


