ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు
అక్రమ మద్యంపై కఠిన నిఘా
98 కేసుల్లో 1,525 లీటర్ల మద్యం సీజ్
782 మందిపై బైండోవర్ చర్యలు
కాకతీయ/రాజన్న సిరిసిల్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఉల్లంఘనలకు సంబంధించి 11 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం విక్రయం, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో 98 కేసులు నమోదు చేసి 1,525 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేయడంతో పాటు రూ. 23,28,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నవారిపై, గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారిపై ముందస్తు చర్యలుగా 224 కేసుల్లో 782 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తూ స్వేచ్ఛాయుత, శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే విజ్ఞప్తి చేశారు.


