భక్తుల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
భీమేశ్వర ఆలయంలో ఆకస్మిక తనిఖీ
బద్ది పోచమ్మ ఆలయ భవన పనులు వేగవంతం చేయాలని ఆదేశం
కాకతీయ, వేములవాడ : వేములవాడలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె ఎస్పీ మహేష్ బి. గీతేతో కలిసి భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వస్తితో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధాభాయి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.
జాతరలు, ఉత్సవాలకు ముందస్తు చర్యలు
సమ్మక్క–సారలమ్మ జాతర, మహాశివరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో చేపట్టిన ఏర్పాట్లను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ కాలినడకన పరిశీలించారు. తాగునీటి సరఫరా, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ సౌకర్యాలు, టాయిలెట్లు, షవర్ స్నానాల ఏర్పాట్లపై అధికారులతో వివరంగా సమీక్షించారు. కోడె మొక్కుల టికెట్ కౌంటర్, వీఐపీ–వీవీఐపీ దర్శన క్యూలైన్లు, ప్రత్యేక దర్శన సౌకర్యాలు సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే బద్ది పోచమ్మ ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న నూతన భవనం స్లాబ్ పనులను వేగవంతం చేసి, అక్కడ ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భీమేశ్వర, బద్ది పోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిశీలనలో ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, తహసీల్దార్ విజయప్రకాశ్ రావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


