సర్పంచ్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : త్వరలో జరగబోయే గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి స్థాయి బందోబస్తుతో ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల పోలీసులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా, మూడు విడతల్లో జరగబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, పోలీస్ స్టేషన్ వారీగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు కమిషనర్ సమీక్షించారు. ప్రతి అధికారి ప్రణాళికబద్ధంగా పనిచేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. నామినేషన్ దశ మొదలుకొని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారు, రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేయాలని, ఎన్నికల గ్రామాలను అధికారులు తరచూ సందర్శించి స్థానికులతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నందున పక్క జిల్లాల నుండి బందోబస్తు సిబ్బంది రానున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందినే సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలో లైసెన్స్ పొందిన ఆయుధ యజమానులు తమ ఆయుధాలను సమీప పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. తరువాత పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, నేరాల నియంత్రణ చర్యలపై విపులంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత, ఏఎస్పీలు శుభం, చైతన్య, అదనపు డిసిపిలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేశ్ కుమార్, శ్రీనివాస్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


