ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
యాసంగి కొనుగోళ్లపై సమగ్ర ప్రణాళిక, కేంద్రాల ఏర్పాటు
కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : యాసంగి సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేసి రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉండగా, 2.7 నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు 240 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గోని సంచులు, తేమ యంత్రాలు, వేయింగ్ స్కేల్స్, ప్యాడీ క్లీనర్లు తదితర పరికరాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు టోకెన్లు సమయానికి ఇవ్వాలని, ధాన్యం వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి బ్యాంక్ ఖాతాల్లో చెల్లింపులు జమ చేయాలని సూచించారు. రైస్ మిల్లర్లు సీఎంఆర్ గడువులోగా అందించాలని, హమాలీలను నియమించి ధాన్యం దిగుమతుల్లో ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీసీఎస్ఓ బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీఆర్డీఓ గీత తదితరులు పాల్గొన్నారు.


