శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల మద్యం ప్రియులు అసభ్య పదజాలంతో ప్రవర్తిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, దీనివల్ల మహిళలు, కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని కమిషనర్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయన్నారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజే సౌండ్ వినియోగంపై కూడా ఈ నెల 31 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వినియోగంపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని కమిషనర్ తెలిపారు. వివాహాలు, శుభకార్యాల పేరుతో వీటిని అనుమతి లేకుండా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలను సహించబోమని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. సంబంధిత ఏసీపీ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


