ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
రోజుకు వంద మందికి పైగా పనులు కల్పించాలి
ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ హాజరు వందశాతం నమోదు చేయాలి
వరంగల్ జిల్లా ఇంచార్జ్ డీఆర్‌డీఓ, జెడ్పీ సీఈవో గూడూరు రాం రెడ్డి
కాకతీయ, గీసుగొండ : ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని వరంగల్ జిల్లా ఇంచార్జ్ డీఆర్‌డీఓ, జెడ్పీ సీఈవో గూడూరు రాం రెడ్డి స్పష్టం చేశారు. గీసుగొండ మండల పరిషత్ కార్యాలయంలో గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రోజుకు కనీసం వంద మందికి పైగా వేతనదారులతో ఉపాధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రియాశీల వేతనదారుల్లో కనీసం 50 శాతం మందిని పనులకు హాజరయ్యేలా మోబిలైజేషన్ చేయాలని సూచించారు. జాతీయ మస్టర్ నిర్వహణ వ్యవస్థ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్) ద్వారా రోజుకు రెండు పూటల హాజరు తప్పనిసరిగా వంద శాతం నమోదు చేయాలని తెలిపారు. పనుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే ఎంపీడీఓలు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు ముమ్మరంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా కార్మిక బడ్జెట్‌లో నిర్దేశించిన పని దినాలు పూర్తి కావాలని, త్వరలో అమలులోకి రానున్న ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ ముఖ గుర్తింపు హాజరు విధానానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సాంకేతిక విభాగ ఈసీ కిషోర్ శిక్షణ ఇచ్చారు. సమావేశంలో అదనపు డీఆర్‌డీఓ శ్రీవాణి, ఎంపీడీఓలు కృష్ణవేణి, రవీందర్, ఎంపీఓలు శ్రీనివాస్, హర్షిత్, ఏపీఓలు చంద్రకాంత్, గణేష్‌తో పాటు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.


