ట్రాఫిక్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు
కాకతీయ, హనుమకొండ : వరంగల్ ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌లో అదనపు డీసీపీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి అదనపు డీసీపీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని, దీని వల్ల జరిగే ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను దుర్ధశకు గురి చేస్తున్నాయని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, అలాచేస్తే వాహన యజమానిపైనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు వద్ద ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



