మొంథా తుఫానుతో అతలాకుతులం
మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలర్టు
విద్యాసంస్థలకు సెలవు.
పలు రైళ్లకు అంతరాయం , ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు.
కళ్లాలో కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం
పడిపోయిన పంట పొలాలు.
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ,ఇతర అధికారులు
కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో తుఫాన్ కారణంగా బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెడ్ అలర్టు ప్రకటించారు. జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో జిల్లా డీఈవో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేలవాలగా , నూర్పిడి చేసిన వరి మొక్కజొన్న ధాన్యం కల్లాలలో, కొనుగోలు కేంద్రాలలోతడిసి ముద్దయింది. దీనితో ఆరుగాలం కష్టపడిన రైతు లకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మహబూబాబాద్ డోర్నకల్, గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్లో రైలు పట్టాలపై నీరు నిలవడంతో డోర్నకల్ స్టేషన్ గోల్కొండ, మహబూబాబాద్ కోణార్క్ ,కృష్ణ ఇతర రైళ్ళను పలు స్టేషన్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు, ప్రయాణికులు తెలిపారు. దీనితో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. తుఫాన్ తో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎప్పటికప్పుడు సమాచారంను చేరవేస్తూ జాగ్రత్తలు పాటించాలని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, లోతట్టు గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని , అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మండల అధికారులను ఆదేశించారు.

రైతులకు ముందస్తు జాగ్రత్తగా వారి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడవకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులకు తగు సలహాలు సూచనలు తెలిపారు. అత్యవసర పరిస్థితులలో కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803 ను సంప్రదించాలని తెలిపారు. తుఫాన్ తో విష జ్వరాలు ప్రబలకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సబ్ సెంటర్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మండల అధికారులు సిబ్బంది కచ్చితంగా వారి కార్యాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎప్పటికప్పుడు జిల్లా నుంచి ఆదేశాలను పాటిస్తూ తమకు సమాచారం అందించాలని కోరారు.



