కంటి వెలుగు పథకం ఆపడం దుర్మార్గం
కేసీఆర్‌పై పగతోనే పథకాన్ని నిలిపిన కాంగ్రెస్
ప్రజల కంటి వెలుగుకు కేసీఆర్ కృషి
కేసీఆర్ సంక్షేమ పాలన ప్రజల హృదయాల్లో నిలిచింది
దీక్షా దివస్‌లో భాగంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో కంటి వెలుగు శిబిరం
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పాలనే పునాది : హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్
కాకతీయ, హన్మకొండ : మానవీయ కోణంతో మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు పథకాన్ని కాంగ్రెస్‌ప్రభుత్వం నిలిపేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు వినయ్‌భాస్కర్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై పగతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసిందని విమర్శించారు. హన్మకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ 11 రోజుల కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ శ్రేణులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. హన్మకొండలోని డాక్టర్ అగర్వాల్స్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 14 ఏళ్ల కేసీఆర్ దీక్షతో 60 ఏళ్ల స్వరాష్ట్ర కల సాకారం అయిందని గుర్తు చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందన్నారు. ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి అందిందని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో కూల్చివేతలు, ఎగవేతలు, మాట తప్పడాలు తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.
420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయక..!
420 హామీలు, 6 గ్యారంటీ లను అమలు చేయక ప్రజలను తప్పుదారి పట్టించే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన డిసెంబర్ 9, 2009 సందర్భంగా మంగళవారం విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీ నారాయణ, జోరిక రమేష్, నాయకులు పులి రజినీకాంత్, నరెడ్ల శ్రీధర్, నార్లగిరి రమేష్, నయీమొద్దీన్, సదాంత్, పానుగంటి శ్రీధర్, సల్వాజి రవీందర్ రావు, దువ్వ కనక రాజు, బుద్దె వెంకన్న, కొండపాక రఘు, తక్కళ్ళపల్లి వినీల్ రావు, కోండ్ర శంకర్, సంజీవ్, శ్రీధర్ రెడ్డి, బచ్చు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


