విద్యా ప్రైవేటీకరణను ఆపాలి
కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా గళమెత్తిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు
కాకతీయ, కరీంనగర్ : విద్యారంగాన్ని కేంద్రీకరించేలా ప్రతిపాదిస్తున్న ‘వికసిత భారత్ శిక్ష అభియాన్’ బిల్లును వ్యతిరేకించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహ ప్రధాన కార్యదర్శి ముస్కుల రఘుశంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం టీఎన్జీవో భవనంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షత వహించారు. విద్యకు తగిన నిధులు కేటాయించకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తూ కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని రఘుశంకర్ రెడ్డి విమర్శించారు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను పక్కనపెట్టి విధానాలు అమలు చేయడం అన్యాయమన్నారు. పాఠ్యాంశాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని తగ్గిస్తూ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా విద్యను పూర్తిగా కేంద్ర ఆధీనంలోకి తీసుకురావాలన్న యత్నమే ఈ బిల్లు అని పేర్కొన్నారు. ఆవాల నరహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధానంతో పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నాయని అన్నారు. సమావేశంలో టీఎస్ఈసీ, డీటీఎఫ్, టీపీటీఎఫ్, జేఎల్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూతోపాటు పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


