ఆక్రమణకు అడ్డుకట్ట..
ప్రభుత్వ భూమిలో బోర్డు పాతిన అధికారులు..
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ పట్టణంలోని విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించేందుకు దుండగులు ప్రయత్నించగా, రెవెన్యూ అధికారులు సకాలంలో జోక్యం చేసుకుని ఆ భూమిని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ హంటర్ రోడ్ పరిధిలోని సర్వే నెంబర్ 964లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, హద్దులు పాతి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టే యత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు హనుమకొండ రెవెన్యూ అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా తెలియజేయగా, తహసిల్దార్ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. డిప్యూటీ తహసిల్దార్ రంజిత్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి బృందం సోమవారం ప్రభుత్వ భూమి వద్దకు చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. విచారణలో భూమి ప్రభుత్వానికి చెందినదని నిర్ధారించడంతో అధికారులు ఆ ప్రదేశంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ నిషేధం అనే బోర్డును పాతారు. రెవెన్యూ అధికారులు సమయానుకూలంగా స్పందించి ప్రభుత్వ ఆస్తిని కాపాడినందుకు స్థానికులు వారిని అభినందించారు.
అక్రమ ఆక్రమణ ప్రయత్నాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు.


