ఇరాన్‌పై దాడులను ఆపాలి
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
ఖమ్మంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, ఖమ్మం: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఖమ్మంలో నిరసన కార్యక్రమం జరిగింది. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం బైపాస్ రోడ్డులో ప్రదర్శన నిర్వహించి అమెరికా యుద్ధ విధానాలను ఖండించారు. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి రామయ్య మాట్లాడుతూ గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్‌పై ఆధిపత్యం కోసం అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇలాంటి యుద్ధాలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. భారతదేశంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధం వల్ల నష్టమే
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా చివరకు నష్టం ప్రజలకే జరుగుతుందని జి రామయ్య అన్నారు. యుద్ధం వల్ల విధ్వంసం తప్ప మరేదీ మిగలదని చెప్పారు. ఇప్పటికైనా అమెరికా తన యుద్ధ విధానాలను ఆపాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ దాడులను ఖండించాలని భారత ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, నగర కార్యదర్శి శోభ, జిల్లా కమిటీ సభ్యులు శిరోమణి, శ్రీనివాస్, నగర నాయకులు లెనిన్, చందు, శ్రీను, తిరపయ్య, దాసు, సైదులు, రామరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.


