కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్ ఎస్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుద్దపూసల లాగా నీతులు చెప్పే అర్హత ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాలలోని రైతు వేదికలలో శనివారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేలేరు మండలంలో 13 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.13.01 లక్షల చెక్కులు, 19 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.5.77 లక్షల చెక్కులు, ధర్మసాగర్ మండలంలో 21 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.21.02 లక్షల చెక్కులు, 41 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.12.38 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికై 21 నెలల్లోనే 1026 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకువచ్చానన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో మరో రెండు వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
నా ఏకైక ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తాను అని స్పష్టం చేశారు. తనను రాజీనామా చేయమనే హక్కు బీఆర్ఎస్‌కు లేదని, ఆనాడు ఆ పార్టీలో చేరిన 36 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేసిన మూడు నెలల్లోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుతున్నాయని చెప్పారు. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేసినట్లు గుర్తు చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సన్న బియ్యం పంపిణీ, సిసి రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను వివరించారు. గండి రామారం లిఫ్ట్-1 పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి వేలేరు, చిల్పూర్ మండలాలకు రెండవ పంటకు సాగునీరు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఏవో, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


