- హుజురాబాద్‌లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుస్తాం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హుజురాబాద్, కాకతీయ: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఓటింగ్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజలంతా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలంటే గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గణనీయంగా సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని గుర్తుచేశారు. మూడో విడతలో కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


