మేడారంలో తొక్కిసలాట
క్యూలైన్ల వద్ద భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఓ మహిళకు తలకు తీవ్ర గాయం..!
కన్నీటి పర్యంతమైన వృద్దులు
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం భక్తుల రద్దీతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. దర్శన క్యూ లైన్ల వద్ద తోపులాటలు జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు తీవ్ర గాయమవ్వగా, అక్కడే ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటర్లు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తోపులాటలో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, కొందరు భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. దర్శనానికి సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని గుర్తించిన పోలీసులు వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు దర్శన మార్గాల సమీపంలో ఉన్న షాపులను తొలగించారు. క్యూ లైన్లను క్రమబద్ధీకరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చామని పోలీసులు వెల్లడించారు. భక్తులు సంయమనం పాటించాలని, సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.



