కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి కేసులపై త్వరలోనే అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ విభాగం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరిపి, వాటిపై తక్షణ చర్య అవసరమని సూచిస్తూ ఏసీబీకి లేఖ రాసింది. విజిలెన్స్ నుంచి వచ్చిన ఈ లేఖను ఏసీబీ డీజీ తెలంగాణ సీఎస్‌కు పంపించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు అధికారికంగా విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.
ఇంతకుముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పలువురు కీలక అధికారుల వద్ద ఏసీబీ పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు, డబ్బును గుర్తించింది. ముఖ్యంగా ఈఎన్సీ, ఈఈ స్థాయి ఇంజినీర్ల వద్ద భారీగా అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల అమలు, టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు చాలా కాలంగా చర్చనీయాంశమవుతున్నాయి. ప్రజల వేల కోట్ల రూపాయల నిధులు ఈ ప్రాజెక్టులో వినియోగించిన నేపథ్యంలో, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. విజిలెన్స్, ఏసీబీ విభాగాలు క్రమంగా ఆధారాలు సేకరిస్తుండటంతో, త్వరలోనే పెద్దఎత్తున విచారణ జరగడం ఖాయమని భావిస్తున్నారు.
విజిలెన్స్ అధికారులు ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా, ఏసీబీ విచారణలో అవినీతి ముసుగులో దాచిన ఆర్థిక లావాదేవీలు, అవకతవకలు బయటపడతాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి రాగానే ఈ దర్యాప్తు ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఒకసారి ఏసీబీ విచారణ మొదలైతే, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి రాక తప్పదని నిపుణుల అంచనా.


